ఇంట్లో ఓ కంప్యూటర్‌…దానికో హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షనూ…క్లిక్‌ చేస్తే చాలు వాయువేగంతో దూసుకువచ్చే సమాచారం…అన్నీ కంటి ముందే ఇంటిలోనే… అన్నీ అందుబాటులోనే ఉన్నా ( నిత్యవసరాలు కాదు కాబట్టి అందుబాటులేనే ఉంటాయి ) నేనెప్పుడూ ఈ బ్లాగుల గురించి పెద్దగా పట్టించుకోలేదు.

ఆఫీసులో ఎనిమిది గంటలు చేసే పని స్క్రిప్ట్‌ రాయడమే. కోరిమరీ జర్నలిస్టు అయ్యాను కాబట్టి వార్తలు రాయడం, నా మిత్రులు రాసిన దాన్ని ఎడిట్‌ చేయడం, కాస్తా కూస్తే దానికి మసాలా అద్దడం  ( మసాలా అంటే తప్పుగా అనుకునేరు…మసాలా అంటే అదనపు హంగులు ) ఇవి రోజూ నేను చేసే పనే. అంటే రాయడం నా జీవితంలో ఓ భాగమన్నమాట. సీన్‌ కట్‌ చేసి అసలు విషయంలో కి వద్దాం…ఏదో అడపాదడపా బ్లాగులు చదవడం తప్ప నేనెప్పుడూ వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఈ మద్య ఇతరుల బ్లాగులను చదవడం, వాటిని ఎంజాయ్‌ చేయడం, ఇంకా చెప్పాలంటే వాటిని ఆశ్వాదిస్తూ మైమరిచి పోయే మిత్రుడొకరి పరిచయమైంది. పలానా వాళ్ల బ్లాగు ఉంది చూడు అన్నాడు. సరే చూశాను. ఇక అప్పటి నుంచీ కొద్దో గొప్పే బ్లాగులు చూస్తూనే ఉన్నాను. అబ్బ..అబ్బ..అబ్బ…ఏం బ్లాగుతున్నారండీ. ఒకటా..రెండా…అసలు బ్లాగుల్లో కనిపించని అంశమంటూ లేదంటే నమ్మండి. పైగా అన్నీ అచ్చ తెలుగులో. తెలుగు బ్లాగుల సమాహారం కూడలి క్లిక్‌ చేస్తే…అయ్యబాబోయ్…ఎన్ని పోస్టులు….వాటిని చూడగానే నాకైతే అనిపించింది. నేనెక్కడో బీసీ కాలంలో ఉన్నానని…మా ఆయనకు అన్నీ తెలుసు..ఆయనో పెద్ద జీనియస్‌ అని మా ఆవిడ  అనుకుంటూ ఉంటుంది. ( పాపం పిచ్చింది..అలాగే అనుకోనిద్దాం ). కానీ ఆమెకు తెలియదు.బ్లాగాడక నేను ఎంత వెనుకబడ్డానో…అమ్మో ఇప్పటికే జరిగిన నష్టం చాలు…ఎన్ని భావాలు మిస్సైయ్యాను…ఎన్ని వర్ణనలు చదవలేకపోయాను…
ఎన్ని కవితలు నా మనసుకు చేరకుండా ఆగిపోయాయి…ఎంత మంది మనసులోని బావాలను నేను తెలుసుకోలేకపోయానో…అందుకే ఆలస్యం చేయలేదు. బ్లాగు ప్రపంచం అనే అతి పెద్ద గృహంలోకి ప్రవేశించేశాను. ఇక ఇక్కడే నివాసం ఏర్పరచుకుంటాను. కృష్ణాతీరం గా మీతో కలిసి అలా నడుస్తూ ఉంటాను. మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను.