రాష్ట్రంలో కొత్త కేబినెట్‌ కొలువుతీరిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి అసంతృప్తుల సెగ తాకింది. అత్యంత రహస్యంగా  కేబినెట్‌ను రూపొందించిన కిరణ్‌కు తొలి కేబినెట్‌ భేటీ జరగకముందే మంత్రులు షాక్ ఇచ్చారు. శాఖలు కేటాయించిన కొన్ని గంటలకే అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరాయి.

శాఖల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న వట్టి వసంత కుమార్‌ తన పదవికి రాజీనామా సమర్పించారు. మంత్రి పదవి వదులుకుంటూ ముఖ్యమంత్రికి ఫ్యాక్స్‌ ద్వారా సమాచారం అందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ పంపించారు. అనేక కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించిన వారికి ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించడంపై మంత్రులు భగ్గుమన్నారు. కేవలం అగ్రకులాలకు మాత్రమే కేబినెట్‌లో అధిక ప్రాధాన్యత దక్కిందని ఆరోపిస్తూ వట్టి రిజైన్ చేశారు. వట్టి బాటలోనే దాదాపు పది మంది మంత్రులు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ధర్మాన, బొత్స, కోమటిరెడ్డి, , జూపల్లిలు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తితో ఉన్నారు. రాత్రి 9 గంటల సమయంలో  మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన వెలువడితే రెండున్నర గంటలు గడిచే సరికి సీన్ మారిపోయింది. మా స్థాయి ఏంటి…ఇవేం శాఖలంటూ మంత్రులు తిరగబడ్డారు.

రాత్రంతా హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్ వద్ద హై డ్రామా నడించింది. వట్టి వసంతకుమార్‌ ఇంట్లో పది మంది మంత్రులు సమావేశమయ్యారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై వీరంతా చర్చించారు.తెల్లారితే తొలి కేబినెట్ భేటీ ఉందనగా… తమ అసంతృప్తిని ఏవిధంగా వెళ్లకక్కాలనే దానిపై చర్చించారు. ఊహించని పరిణామానికి వెంటనే తేరుకున్న ముఖ్యమంత్రి అసంతృప్తి జ్వాలలను చల్లార్చే ప్రయత్నం చేశారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని రాయబారానికి పంపారు. మంత్రి బొత్సా సత్యనారాయణ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి రవాణా శాఖ కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్‌ సమావేశంలో దీనిపై చర్చిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం

కేబినెట్‌లో బెర్త్‌లు దక్కని వారి సెగ ఓ వైపు…చోటు దక్కినా…ప్రధాన్యత ఉన్న శాఖ దగ్గని అసంతృప్త వాదులు మరో వైపు…  ముహుర్తాలు చూసుకొని మరీ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కెప్టెన్‌ కిరణ్ కుమార్ రెడ్డి తొలి రోజే ఊహించని షాక్ తగిలింది.

Advertisements