రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులందరం కలిసి కార్తీక మాసం సందర్భంగా  శ్రీశైలం వెళ్లాం. ఘాట్‌ రోడ్డు నుంచి కృష్ణానది అందాల వరకూ …ప్రకృతి అందాలను చూసి పులకించిపోయాను. అయితే

ఓ విషయంలో మాత్రం నేను తీవ్రంగా బాధపడ్డాను. చెబితే చాలా మందికి అదో విషయమా అని అనిపించవచ్చు…

శ్రీశైలంలో పాతాళగంగకు వెళ్లాలంటే దాదాపు 500లకు పైగా మెట్లను దిగాల్సి ఉంటుంది. అయితే ఏపీ టూరిజం కొండపై  నుంచి పాతాళగంగకు రోప్‌ వే ఏర్పాటు చేసింది. ఇదో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌. రోప్‌ వే ఎక్కి డైరెక్ట్‌గా పాతాళగంగ వరకూ వెళ్లవచ్చు. అయితే రోప్‌వేలోకి వెళ్లే మందు యాత్రికులు వెయిట్‌ చేసేందుకు వీలుగా టూరిజం శాఖ ఓ హాల్‌ను నిర్మించింది. ఇక్కడ నుంచి చూసినా శ్రీశైలం అందాలు అద్భుతంగా కనువిందు చేస్తాయి. అయితే ఆ హాల్‌లోకి ఎంటర్‌ కాగానే నా దృష్టంగా గోడలపైకి మళ్లింది. ఎంతో నీటుగా శుభ్రంగా ఉంచాల్సిన ఆ గోడలను కొంతమంది యాత్రికులు తమ వెకిలి రాతలతో కరాబు చేసేశారు. కొంతమంది తమ పేరు, ఊరు, ఫోన్‌ నెంబర్లు రాసుకున్నారు. మరికొంతమంది లవ్‌ లెటర్లు రాశారు. మరికొంత మంది అసభ్య పదాలతో ఏవేవో రాశారు. కనీస సంస్కారం లేకుండా ఎందుకిలా చేశారా అని చాలా బాధపడ్డాను. సమాజంలో మనకు కొంతమంది చదువుకున్న ( కొన్న) పోకిరీలు ఎదురౌతూ ఉంటారు. వాళ్లు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నా… పరిపక్వత లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. కరెన్సీ నోట్లపై పిచ్చి పిచ్చి గీతలు, రాతలు రాయడం, పబ్లిక్‌ స్థలాలు, పబ్లిక్ ఆస్తులపై ఇలాంటి రాతలు రాయడం చేస్తూ ఉంటారు. శిక్షించాల్సినంత పెద్ద నేరంగా ఇది కనిపించకపోవచ్చు కానీ…వ్యక్తుల నైతిక బాధ్యత, వారి విలువులకు సంబంధించినంత వరకూ మాత్రం నా ఉద్దేశంలో ఇలా చేయడం పెద్ద తప్పుడు వ్యవహారమే. మనది కాకపోతే చాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం చాలా మందికి అలవాటు.. పబ్లిక్ స్థలాల్లో గోడలపై పిచ్చి పిచ్చి రాతలు రాసే వ్యక్తులు తమ ఇంట్లో బెడ్‌రూంలో అలానే రాస్తారా..? మన ఇల్లు శుభ్రంగా ఊడ్చుకొని పక్కింటోళ్ల గుమ్మం ముందు ఆ చెత్తను పడేయడం లాంటిదే ఇది కూడా…ఓ రోజు హైదరాబాద్‌లో సిటీ బస్సులో వెళుతున్నా. కాలేజ్‌కి వెళుతున్న కొంతమంది స్టూడెంట్‌ ఎక్కారు. సీటు వెనుక ఏదేదో రాసేస్తున్నారు. వద్దూ అన్నా…. ఇదేం నీ ఇల్లు కాదు…నా ఇష్టం అన్నాడు….అది పరిస్థితి. వాళ్లు కాలేజ్‌కు వెళ్లి కేవలం మాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లాంటివే నేర్చుకుంటున్నారు. తప్పెవరిది….?

Advertisements