సెల్‌ఫోన్‌లో వచ్చిన మెసెజ్‌ చూసుకొని ఎవరైనా  ఫక్కున నవ్వారంటే…ఖచ్చితంగా ఆ మెసెజ్‌ సర్దార్‌పైనే అయి ఉంటుంది. సాధారంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఫార్వర్డ్ అయ్యే సంక్షిప్త సందేశాల్లో నవ్వు పుట్టించే సర్దార్‌ సందేశాలే ఎక్కువగా ఉంటాయి. ఎలా పుట్టిందో తెలియదు….ఎందుకు పుట్టిందో తెలియదు..ఎవరు పుట్టించారో తెలియదు… మనం నవ్వుకోవడం కోసంమనలో ఒకడైన సర్దార్‌ను వెర్రి వెంగళప్ప చేసి… SMSల రూపంలో పంపిస్తూ ఉంటాం.

వెర్రి వేయివిధాలు అన్నట్లు సర్దార్ సందేశాల రూపంలో మెసెజ్‌లు చలామణి అవుతూ ఉంటాయి. అయితే ఆ మధ్య నేను ఆకాశమంత అనే సినిమా చూశాను. అందులో సర్దార్‌పై ఓ చిన్న ఎపిసోడ్ ఉంటుంది. బహుశా సర్దార్‌లపై SMSల రూపంలో జరుగుతున్న మానసిక దాడి తప్పు అని చెప్పేందుకు ఆ సినిమా డైరెక్టర్‌ కావాలనే ఆ సన్నివేశాలను పెట్టాడేమో అనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్‌ స్నేహితుడు సర్దార్‌ల గొప్ప తనాన్ని ఇలా చెబుతాడు. ఓసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ఓ క్యాబ్‌ ఎక్కుతాడు. దానికి డ్రైవర్‌ ఓ సర్దార్‌. వెనుక కూర్చొని సర్దార్‌లపై జోకులు వేసుకుంటూ ఉంటారు. క్యాబ్‌ దిగి వెళిపోతుండగా ఆ సర్దార్‌ డ్రైవర్ ఓ మాట అంటాడు. జేబులో నుంచి ఓ రూపాయి తీసి ఇచ్చి…మీరు ఈ సిటీ వదిలి వెళ్లే లోపు ఎక్కడైనా సర్దార్‌ బిచ్చగాడు కనిపిస్తే ఈ రూపాయి ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోతాడు…. ఆశ్చర్యకరంగా బిచ్చమెత్తుకొనే సర్దార్‌ ఒక్కడూ కనిపించడు. అప్పుడు అతను అనుకుంటాడు.. సర్దార్లు ఒళ్లు వంచి పనిచేస్తారు. మనం మాత్రం వాళ్లపై జోకులు వేసుకొని కాలక్షేపం చేస్తామని… సినిమాలో చెప్పినా అది మటుకు చాలా వరకూ వాస్తవమే. ఆ సినిమా చూసిన తర్వాత సర్దార్‌ మెసెజ్‌లు నా ఫోన్‌కు వస్తే…వెంటనే ఆ సీను గుర్తుకువచ్చేది. సర్దార్‌జి మెసెజ్‌లు ఎవరికైనా ఫార్వడ్‌ చేయాలంటే ఒకింత ఆలోచించే వాడిని.. అయితే ఆ సినిమా ఎఫెక్టో లేక…మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ…ఈ మధ్య ఎందుకే… ఎవరి సెల్‌ఫోన్ల లోనూ సర్దార్ జీ ఫన్నీ మెసెజ్‌లు కనిపించడం లేదు. ఉన్నట్టుండి ఆ ప్లేస్‌ను ఇద్దరు వ్యక్తులు ఆక్రమించేశారు. వాళ్లే మన బాలయ్య. జూనియర్ ఎన్టీఆర్‌. వీళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణలే ( ఆల్‌ క్రియేడెట్‌) జనాలకు నవ్వు తెప్పించే సందేశాలు. సర్దార్‌లు అనగానే సమాజంలో ఓ వర్గం. వాళ్ల పై వచ్చే smsలు వాళ్లందరికీ వర్తిస్తాయి. కానీ బాలయ్య, జూనియర్‌ ఎన్టీఆర్‌లు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే. సో ఇవి వీళ్లకే వర్తిస్తాయి.  ( వీళ్లిద్దరూ ఫన్నీ సరుకులా అన్నది వేరే చర్చ) కానీ సీనియర్ అండ్ జూనియర్ హీరోల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని జనాల ఫోన్స్‌ నుంచి సర్దార్‌ జీ కనుమరుగైపోయాడు.

Advertisements