రాజకీయ వ్యవస్థను, శాసనవ్యవస్థను ప్రజలు పెద్దగా విశ్వసించకపోయినా… న్యాయవ్యవస్థపై మాత్రం కొద్దో గొప్పో గౌరవంతోనే ఉంటారు. న్యాయదేవతకళ్లకు గంతలు కట్టినా…ఏదో ఓ స్థాయిలో న్యాయం జరుగుతుందన్న ఆశ ప్రజలకు ఉంటుంది. న్యాయమూర్తులు అనగానే చెప్పలేని గౌరవం కూడా వస్తుంది. అయితేఎన్నో లోపాలు కనిపించినా భారతీయ న్యాయవ్యవస్థ ఉన్నతంగానే వ్యవహరిస్తూ వస్తోంది.అయితే తమిళ తంది రాజా అంటించిన స్పెక్ట్రం చిచ్చు అన్ని వ్యవస్థలమూలాలను కుదిపే స్థాయికి వచ్చింది. నీరారాడియా టేపుల ద్వారా కార్పోరేట్‌లాబీయింగ్‌లో మీడియా చిక్కుకోవడం విస్మయాన్ని కలిగిస్తే…అదే రాజా వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూసరికొత్త వివాదానికి తెరలేపారు.

మాజీ కేంద్ర టెలికాం మంత్రి రాజా ఓ క్రిమినల్‌ కేసుకు సంబంధించి మద్రాస్‌  హైకోర్టు న్యాయమూర్తిని ప్రలోభపెట్టారన్నది వివాదం. అయితే దీనికి సంబంధించి అప్పటి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గోఖలే…అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్‌కు ఓ లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖ చుట్టూనే వివాదం ముసురుకుంది.

జస్టిస్‌ బాలకృష్ణన్‌ చెప్పిందేంటి…?

జస్టిస్‌ రఘుపతి వ్యవహారానికి సంబంధించి ( రాజా ఈయన్నే ప్రలోభపెట్టారన్నది ఆరోపణ) నాకు అందిన లేఖలో ఎక్కడా రాజా పేరు పేర్కొనలేదు. ఏ కేంద్ర మంత్రి పేరు ఇందులో లేదు.

వాస్తవానికి ఈ లెటర్‌ పై మీడియాలో కథనాలు వచ్చిన వెంటనే సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి .బాలకృష్ణన్‌ మీడియా సమావేశాన్ని పెట్టి మరీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తనకు అందినలేఖలో ఏ కేంద్ర మంత్రి పేరూ లేదని వక్కాణించారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న అప్పటి మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గోఖలే ఇవాళ ఓబాంబు పేల్చారు. బాలకృష్ణన్‌ ప్రకటనకు విరుద్ధమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

జస్టిస్‌ గోఖలే ఏం చెప్పారు…?

ఓ క్రిమినల్‌ కేసు విషయంలో మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రఘపతిని అప్పటి కేంద్ర మంత్రి రాజా ప్రలోభపెట్టిన విషయం చీప్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాకు తెలుసు. లేఖలో రాజా పేరును స్పష్టంగా పేర్కొన్నాను. …ఇది జస్టిస్‌ గోఖలే పేల్చిన బాంబు. లేఖ రాసింది జస్టిస్‌ గోఖలే….లేఖ అందుకుంది జస్టిస్‌ కె.జి. బాలకృష్ణన్‌…లేఖలోఏముంది అన్న విషయంలో ఇద్దరు న్యాయమూర్తులు చెబుతున్నదానికి పొంతనే లేదు.

ఇంతకీ ఆ క్రిమినల్‌ కేసు విషయంలో ఏం జరిగింది….?

>న్యాయమూర్తి రఘుపతిని ప్రలోభపెట్టిన  విషయం వాస్తవమా కాదా…?

ఈ విషయాన్ని జస్టిస్‌ గోఖలే …జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ దృష్టికి తీసుకువచ్చారా లేదా…?

లేఖలో రాజా పేరు పేర్కొన్నానని జస్టిస్‌ గోఖలే స్పష్టంగా చెబుతున్నప్పుడు…మరి బాలకృష్ణన్‌ ఆ విషయాన్ని ఎందుకు అంగీకరించడం లేదు…?

అంటే జస్టిస్‌ బాలకృష్ణన్‌  వాస్తవాలను దాస్తున్నారా…?

రాజా పేరు లేదనిపదే పదే బాలకృష్ణన్‌ ఎందుకు చెబుతున్నట్లు….?

ఒకవేళ జస్టిస్‌ బాలకృష్ణన్‌ చెప్పిందే నిజమైతే…జస్టిస్‌ గోఖలే లేఖలో రాజాపేరు ఉన్నట్లు ఎందుకు చెబుతున్నారు….?

ముగ్గురు న్యాయమూర్తులు…జస్టిస్‌ రఘుపతి , జస్టిస్‌ గోఖలే, జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ జరిగింది….?

ఒకరు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మరొకరు ప్రస్తుత న్యాయమూర్తి …వీరిద్దరు భిన్నమైన ప్రకటనలు చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి….?

రాజా రూపంలో న్యాయవ్యవస్థలో రాజకీయాలు ప్రవేశించాయా..?
రాజా- న్యాయవ్యవస్థ కు సంబంధించి ఈ ఎపిసోడ్‌లో తలెత్తుతున్న ప్రశ్నలకుసమాధానం చెప్పేదెవరు….?

Advertisements