గ్రేట్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ తమాషా మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ వ్యవహారాలను చూస్తుంటే..ఒక్కోసారి చాలా గందరగోళంగా… తిక్కతిక్కగా…జనాలను…వెర్రి

వెంగలప్పలను చేసేలా ఉంటాయి. జగన్‌ లక్ష్య దీక్ష చూస్తే  నాకదే అనిపించింది.

జగన్‌ దీక్ష…ఆయన ఎజెండా గురించి పక్కనపెట్టి…ఆయన పంచన చేరిన కాంగ్రెస్ నేతల గురించి మాత్రం ప్రస్తుతానికి మాట్లాడుకుందాం. ఇక్కడ ముగ్గురే క్యారక్టర్లు. ఒకరు జగన్మోహన్‌రెడ్డి…రెండు కాంగ్రెస్ పార్టీ.. మూడు జగన్‌కు జై కొడుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు.

 

జగన్‌ ఎవరు…? – తన తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం వస్తుందని ఆశించి…చివరకు భంగపడి…కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే..ఇక సీఎం పోస్ట్ దక్కదని….పార్టీతో తెగతెంపులు చేసుకొని సోనియాపై బహిరంగ ఆరోపణలు చేసి మరీ  పార్టీ వీడిన ఓ మాజీ ఎంపీ…

 

జగన్‌కు జై కొడుతున్నది ఎవరు…?- హైకమాండ్‌ అంటే దేవుడితో సమానం అన్నట్లు కబుర్లు చెబుతూ..సోనియా పలికిందే వేదం అంటూ వల్లె వేస్తూ… కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బి ఫార్మ్స్‌పై ప్రజా ప్రతినిధులుగా  ఎన్నికై…ఆ పార్టీలోనే ఉన్నవాళ్లు… జగన్‌ వెంట ఎవరైనా వెళ్లవచ్చు… జగన్‌కు ఎవరైనా జై కొట్టవచ్చు…రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు…ఇంత వరకూ ఎలాంటి అనుమానాలులేవు…. కానీ అటూ…ఇటూ గా వ్యవహించే వారి విషయంలోనే నైతికత అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.  లక్ష్య దీక్షలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 30 మంది  ప్రజా ప్రతినిధులు ( ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ) జగన్‌ నామస్మరణ చేశారు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ పైనే పోరాటానికి సిద్ధపడి మరో పార్టీ పెట్టే ఏర్పాటులో ఉన్న ఒక వ్యక్తికి వీరంతా మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్‌లో జరిగే తమాషా ఇదే.

 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలేమో ( లక్ష్య దీక్షకు వచ్చిన వాళ్లు) జగన్‌ జిందాబాద్ అంటారు… మరి ఆ జగనేమో..కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి రోజులు మూడాయని ఘాటుగా విమర్శిస్తారు…ఇదెక్కడి చోద్యమో అర్థంకాదు.

ఇక్కడ ప్రధానమైన ప్రశ్నలేటంటే….?

 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డ్యూయల్‌ రోల్‌ ఎందుకు ప్లే చేస్తున్నట్లు….?

 

జగన్‌తో జత కట్టాలనుకున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఉండటం ఎందుకు…?

 

పార్టీని వీడిని వ్యక్తికి, పార్టీపై పోరు చేస్తున్న వ్యక్తికి సోనియాను టార్గెట్‌ చేసుకున్న వ్యక్తికి మీరు జై కొట్టడం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారు…? ఇందులో మీ నైతికత ఎంత…?

 

ఎన్నికలొచ్చే వరకూ పార్టీలో ఉందా…? ఎన్నికలొస్తే..జగన్‌కు జై కొట్టి పార్టీ వీడదాం…అన్న వైఖరి ఎంత వరకూ సమంజసం…?

 

ఓ ప్రాంతానికి ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారంటే…రెండు కారణాలు ఉంటాయి. ఒకటి వ్యక్తిగత ఇమేజ్‌. లేదా…పార్టీ ఇమేజ్…  పార్టీ గుర్తు చూసి ఓటేసిన జనాలకు ఇప్పుడు మీరు ఏం చెబుతారు…?

 

సాధారణంగా కొత్త పార్టీలు పుట్టుకొచ్చేటప్పుడు…రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కాస్త భిన్నమైనవి….ఓటు వేసి గెలిపించిన జనాలతో సంబంధం లేకుండా… ఆదరించిన పార్టీతో సంబంధం లేకుండా…ఎవరికి వారికి వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి. అందుకే కాంగ్రెస్‌ను జగన్‌ తిడుతుంటే…ఆయనకే జై కొడుతున్నారు సోనియా కండువా మెడలో వేసుకున్న సో కాల్డ్ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు….

 

Advertisements